ttv dinakaran: కేంద్ర ప్రభుత్వ అండతో నన్ను బెదిరిస్తున్నారు.. నేను భయపడను: దినకరన్
- నన్ను చూసి పళని, పన్నీర్ భయపడుతున్నారు
- ప్రజా స్పందనను జీర్ణించుకోలేకపోతున్నారు
- త్వరలోనే అమ్మ ఆశించిన పాలన రాబోతోంది
తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని అన్నాడీఎంకే తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని సీబీఐ, ఐటీ దాడుల ద్వారా పళనిస్వామి ప్రభుత్వం తనను బెదిరిస్తోందని... వారి బెదిరింపులకు తాను భయపడనని ఆయన తెలిపారు. దివంగత జయలలిత ఆశించిన పాలన త్వరలోనే తమిళనాట రానుందని చెప్పారు.
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ఓటర్లు తనకు అఖండ మెజార్టీని కట్టబెట్టడాన్ని అధికారపక్షం జీర్ణించుకోలేకపోతోందని... అందుకే కుట్రకు తెరదీశారని ఆయన ఆరోపించారు. తనకు మద్దతుగా ప్రజలే కాకుండా అన్నాడీఎంకే కేడర్ కూడా కదులుతోందని చెప్పారు. తనకు వస్తున్న స్పందనను చూసి పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు భయపడుతున్నారని తెలిపారు.
మరోవైపు, దినకరన్ గెలుపుకు కృషి చేయడం ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో వరుదునగర్, వేలూరు, తూత్తుకూడి జిల్లాలకు చెందిన 9 మంది నేతలను అన్నాడీఎంకే నుంచి సస్పెండ్ చేశారు.