bank: ఖాతాలో కనీస నిల్వ లేని కారణంగా ఎస్బీఐ వసూలు చేసిన మొత్తం రూ. 1772 కోట్లు
- నవంబర్ 2017 వరకు రూ. 2,321 కోట్లు వసూలు చేసిన బ్యాంకులు
- 2015-16 కంటే రెట్టింపు వసూళ్లు
- వివరాలు వెల్లడించిన ప్రభుత్వం
బ్యాంకు ఖాతాలో సగటు నెల కనీస నిల్వ లేకపోతే బ్యాంకులు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి జరిమానాల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1772 కోట్లు రాబట్టింది. ఏప్రిల్ 2017 నుంచి నవంబర్ 2017 వరకు కనీస నిల్వ లేని కారణంగా బ్యాంకులు వసూలు చేసిన జరిమానాల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. అన్ని బ్యాంకులు కలిపి రూ. 2,321 కోట్లు వసూలు చేశాయి.
2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2017-18లో వసూలు చేసిన మొత్తం రెట్టింపు కంటే అధికంగా ఉంది. 2016-17లో రూ. 864 కోట్లను జరిమానాల రూపంలో బ్యాంకులు పొందాయి. ఎస్బీఐ తర్వాత అతి ఎక్కువ జరిమానాలు విధించిన బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంకు రూ. 97 కోట్లను వసూలు చేసింది. తర్వాతి స్థానాల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ. 69 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ. 62 కోట్లు), ఐడీబీఐ (రూ. 52 కోట్లు), ఇండియన్ బ్యాంక్ (రూ. 51 కోట్లు), సిండికేట్ బ్యాంక్ (రూ. 38 కోట్లు) వసూలు చేశాయి.