Venkaiah Naidu: ‘అమెరికా ప్రయాణం - పాతచింతకాయ పచ్చడి’... వెంకయ్యనాయుడు చెప్పిన తమాషా సంఘటన!

  • మొట్టమొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు చింతకాయ పచ్చడి, చింతాకు పొడి మా ఆవిడ ఇచ్చింది
  •  బ్రెడ్ పై చింతకాయపచ్చడి పూసి తినేవాడిని
  • ‘నాలుగు రోజులు పచ్చడి తినకుండా ఉండలేవా?’ అని నాతో వచ్చిన ఓ ఎంపీ ప్రశ్నించింది
  • ఐదోరోజున ఆమె కూడా పచ్చడి కావాలని అడిగింది

మన పెద్దవాళ్లు చెప్పిన మాటలకు ఎంతో అర్థముందని, వాటిని పాతచింతకాయపచ్చడిగా కొట్టిపారేయ కూడదని సూచించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చెప్పి అందరినీ నవ్వించారు. 29వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ కథ చెప్పారు.

‘నేను మొట్టమొదటిసారి అమెరికా వెళ్లాను. అక్కడికివెళ్లేటప్పుడు, పాతచింతకాయ పచ్చడి, చింతాకు పొడి, మినుముల పచ్చడి కొంత ప్యాక్ చేసి మా ఆవిడ ఇస్తే వాటిని తీసుకెళ్లాను. అమెరికాలో అంతా బ్రెడ్..ఆ బ్రెడ్ అంటేనే మనకు మనసు డెడ్.ఆరోగ్యం బాగాలేకపోతేనే బ్రెడ్ తినడం మనకు అలవాటు. బన్ను, బ్రెడ్, ఒక టీ ఇస్తే..ఆ టీలో వాటిని ముంచుకుని తినడం మనకు అలవాటు..ఆసుపత్రి గుర్తొస్తుంది.

అయితే, అక్కడ ఏం తినాలన్నా..బ్రెడ్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి మారింది. మనవాళ్లు అక్కడ చేరిపోయారు. ఇడ్లీ-సాంబారు, దోశెలు..అక్కడ వచ్చేశాయి. అయితే, అక్కడ నాకు బ్రెడ్ ఇస్తే, దానిని తినలేక, దానిపై చింతకాయ పచ్చడి రాశా. నాతోపాటు పార్లమెంట్ సభ్యురాలు ఒకామె వచ్చింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయింది. ఇప్పుడు మాజీమంత్రిగా ఉంది.

నేను బ్రెడ్ పై చింతకాయ పచ్చడి రాస్తుంటే.. ‘నాలుగు రోజులు పచ్చడి లేకుండా గమ్మున ఉండలేరా? బ్రెడ్-జామ్ తినొచ్చుగా’ అని ఆమె నాతో అంది. నాలుగురోజులు గడిచాయి. ఐదోరోజున కూడా నేను అదేవిధంగా తింటున్నాను. దాంతో ఆమె నాతో ‘ఇంకొద్దిగా ఉందా పచ్చడి?’ అని అడిగింది. వెంటనే ఇస్తూ, 'మొహమాటపడొద్దు, సిగ్గుపడొద్దు, శుభ్రంగా తినమ'ని ఆమెకు చెప్పాను. ఆ మరుసటి రోజు నుంచి నేను వచ్చే దాకా ఆగి, చింతకాయపచ్చడి, చింతాకు పొడి వేసుకుని ఆమె బ్రెడ్ తినేది’ అంటూ నాటి విషయాన్ని చెప్పి వెంకయ్య అందర్నీ నవ్వించారు.

  • Loading...

More Telugu News