Steve Smith: ఎవరికీ అందనంత ఎత్తులో ఆసీస్ కెప్టెన్ స్మిత్.. ఒక్క సెంచరీతో దిగ్గజాల రికార్డులు బద్దలు!
- పరుగుల వాన కురిపిస్తున్న ఆసీస్ కెప్టెన్
- డాన్ బ్రాడ్‌మన్ సరసన స్మిత్
- దాసోహమంటున్న రికార్డులు
ఆస్ట్రేలియా రన్ మెషీన్ స్టీవ్ స్మిత్ దెబ్బకు దిగ్గజాల రికార్డులు బద్దలవుతున్నాయి. యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో అజేయ సెంచరీ (102) చేసిన స్మిత్‌కు పలు రికార్డులు దాసోహమయ్యాయి. ఈ టెస్టులో తొలుత పైచేయి సాధించిన ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ సెంచరీ చేసి టెస్టును డ్రా చేసి ఇంగ్లిష్ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు.
స్మిత్‌కు టెస్టుల్లో ఇది 23వ సెంచరీ కాగా, మెల్బోర్న్ స్టేడియంలో ఇది వరుసగా నాలుగోది. ఈ సిరీస్‌లో మూడోది. తాజా సెంచరీతో స్మిత్ ప్రపంచ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ సరసన చేరాడు. గతంలో బ్రాడ్‌మన్ ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇన్నేళ్లకు స్మిత్ ఈ రికార్డును సమం చేసి ఎవరికీ అందని ఘనతను సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు పలు రికార్డులను కూడా స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మరో రికార్డు సృష్టించాడు. స్మిత్ ఈ ఏడాది ఇప్పటి వరకు 1,305 పరుగులు చేశాడు. అంతేకాదు.. ఇలా వెయ్యికిపైగా పరుగులు సాధించడం స్మిత్‌కు ఇది వరుసగా నాలుగో సారి. గతంలో ఆస్ట్రేలియాకే చెందిన మాథ్యూ హెడెన్ ఈ ఘనత సాధించగా ఇప్పుడు స్మిత్ దానిని అందుకున్నాడు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. వరుసగా నాలుగేళ్లు 70కిపైగా సగటుతో వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా స్మిత్ రికార్డులకెక్కాడు.
ఇక అత్యంత వేగంగా 23 సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా స్మిత్ అవతరించాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న సచిన్‌ను స్మిత్ వెనక్కి నెట్టాడు. సర్ డాన్ బ్రాడ్‌మన్ 59 ఇన్నింగ్స్‌లలో 23 సెంచరీలు చేయగా, సునీల్ గవాస్కర్ 102, మహమ్మద్ యూసుఫ్ 122, సచిన్ టెండూల్కర్ 123 ఇన్నింగ్స్‌లలో 23 సెంచరీలు సాధించారు. టెస్ట్ జట్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆసీస్ కెప్టెన్లలో అలెన్ బోర్డర్, స్టీవ్ వా సరసన స్మిత్ నిలిచాడు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ 945 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా, 893 పాయింట్లతో టీమిండియా సారథి కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.