KCR: నేను ఆ మాట అనగానే రాజ్‌నాథ్ సింగ్ షాక్‌తో కుర్చీలో కూలబడ్డారు: కేసీఆర్
- బహిరంగ సభలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన కేసీఆర్
- రైతులకు రూ.8 వేల ఆర్థిక సాయంపై రాజ్‌నాథ్ అడిగారన్న సీఎం
- తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న సీఎం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కోకాపేట సమీపంలో యాదవ, కురుమ సంక్షేమ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. కులవృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థిక సహకారం అందిస్తూ సంపదను సృష్టిస్తామని పేర్కొన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ తనకు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు రూ.8 వేలు అందిస్తామన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ విషయాన్ని తాను చెప్పగానే రూ.8 వేల ఆర్థిక సాయాన్ని ఎలా అందించగలుగుతారని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనను అడిగారని గుర్తు చేశారు.
ఆయన ప్రశ్నకు బదులిస్తూ సాయంగా ఇచ్చిన డబ్బులను రైతులు తిరిగి ఇవ్వాలని కాదని, ప్రభుత్వం తరపున అది సాయం మాత్రమేనని చెప్పడంతో ఆయన షాక్ తిని కుర్చీలో కూలబడ్డారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మంత్రి తేరుకుని 'కేంద్ర రాజకీయాల్లోకి వస్తావా?' అని ప్రశ్నించారని, దానికి తాను రానని, రాష్ట్రంలోనే ఉంటానని తెగేసి చెప్పినట్టు కేసీఆర్ వివరించారు.