Chandrababu: జనవరి 2 నుంచి ఐదో విడత ‘జన్మభూమి’ : సీఎం చంద్రబాబు

  • ‘జన్మభూమి’ కార్యక్రమంపై మీడియా సమావేశం
  • విభజన తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు శ్రీకారం చుట్టాం
  • ‘జన్మభూమి’ స్ఫూర్తి ప్రతిఒక్కరిలోనూ ఉండాలి 

జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ఐదో విడత ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘జన్మభూమి’ కార్యక్రమంపై ఈరోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో నిర్వహించిన ‘జన్మభూమి’లో అనేక మంది భాగస్వాములయ్యారని, రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు.

2014 నుంచి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు ‘జన్మభూమి’ నిర్వహించామని చెప్పారు. ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములను చేయడమే ‘జన్మభూమి’ లక్ష్యమని, ‘జన్మభూమి’ స్ఫూర్తి ప్రతిఒక్కరిలోనూ ఉండాలని, గ్రామం విడిచి బయటకు వెళ్లిన వారిలో సొంతూరుకు ఏదోఒకటి చేయాలనే స్ఫూర్తి నింపాలని సూచించారు. ‘జన్మభూమి - మా ఊరు’ అందరికీ పండగ లాంటిదని, పండగ వాతావరణంలో దీనిని నిర్వహించాలని కోరారు.

ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటిని విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని, ‘జన్మభూమి’ కార్యక్రమంలో కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని, భవిష్యత్ కు నాంది పలికేలా ‘జన్మభూమి’ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ప్రజల నుంచి ఇప్పటికే వివిధ రూపాల్లో అనేక దరఖాస్తులు వచ్చాయని, ఆర్థిక, ఆర్థికేతర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా వచ్చాయని చెప్పారు.

‘జన్మభూమి’లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు జరుగుతాయని, ప్రతిరోజు రెండు గ్రామసభలు జరుగుతాయని, లబ్ధిదారులకు వివిధ రకాల ఆస్తులను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో వివిధ అంశాలపై పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించనున్నామని అన్నారు. ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా, సంక్రాంతికి గ్రామానికి వచ్చి సేవ చేయాలని, పదిరోజుల పాటు తాను జిల్లాల్లో జరిగే ‘జన్మభూమి’ కార్యక్రమాల్లో పాల్గొంటానని  చెప్పారు.

  • Loading...

More Telugu News