tirumala: ఇక రాకండి... చేతులెత్తేసిన టీటీడీ!
- 12 తరువాత క్యూలైన్లోకి అనుమతించబోము
- ఇప్పటికే 1.60 లక్షల మంది దర్శనానికి
- శనివారం అర్ధరాత్రి వరకూ తెరచుకుని ఉండే వైకుంఠ ద్వారాలు
తిరుమల వెంకన్న యోగ నిద్రను విరమించి, ముక్కోటి దేవతలకూ దర్శనమిచ్చే శుభవేళ, తాము కూడా దేవదేవుని దర్శించుకోవాలని వచ్చిన భక్తుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఈ మధ్యాహ్నం 12 గంటల తరువాత క్యూ లైన్లోకి ఎవరినీ అనుమతించబోమని, వారికి వైకుంఠ ద్వార దర్శనం ఉండబోదని స్పష్టం చేస్తూ చేతులెత్తేసింది.
ఇప్పటికే లక్షా 60 వేల మంది దర్శనానికి వేచి చూస్తున్నారని, నిరంతరాయంగా శనివారం అర్ధరాత్రి వరకూ స్వామివారి దర్శనానికి వీరిని అనుమతిస్తామని వెల్లడించారు. ఈ ఉదయం నుంచి క్యూ లైన్లలోకి ప్రవేశించిన వారు కనీసం 30 గంటల పాటు దర్శనానికి వేచి చూడాల్సి వుంటుందని, వారిని నేటి రాత్రికి క్యూ కాంప్లెక్స్ లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా, వీఐపీల దర్శనాన్ని గంట నుంచి గంటన్నరలో ముగిస్తామని చెప్పిన అధికారులు, దాదాపు 3500కు పైగా టికెట్లు జారీ చేసి, వారి కోసం సుమారు 4 గంటల పాటు సామాన్య భక్తులకు దర్శనం లేకుండా చేయడంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.