Gas cylinder: వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఇక నెలనెలా ధరల పెంపు లేనట్టే!
- ప్రస్తుతం సిలిండర్‌పై ప్రతినెల రూ.4 పెంపు
- ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- వెనక్కి తగ్గిన ప్రభుత్వం...
- చమురు కంపెనీలకు ఆదేశాలు జారీ
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరలను నెలనెలా పంచే పద్ధతికి స్వస్తి చెప్పినట్టు ప్రకటించింది. ప్రతీ నెలా రాయితీ వంటగ్యాస్ సిలిండర్‌పై నాలుగు రూపాయలు పెంచుతూ పోతున్న చమురు సంస్థలు వచ్చే ఏడాది నాటికి రాయితీని పూర్తిగా ఎత్తివేయాలని యోచిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్‌కు నెలకో ధర ఉండడంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఇకపై ప్రతినెల గ్యాస్ ధరను పెంచే పద్ధతిని విరమించుకోవాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది జూలైలో చమురు కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ సిలిండర్‌పై ప్రతీ నెల రెండు రూపాయలు పెంచాలని పేర్కొంది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో రూ.2లను ఈ ఏడాది మేలో రూ.4 చేశారు. జూన్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఫలితంగా వచ్చే ఏడాది మార్చి నాటికి వంట గ్యాస్‌పై అందిస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయవచ్చని ప్రభుత్వం భావించింది.
ప్రస్తుతం అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడం, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతోంది. దీనికి తోడు గ్యాస్ ధరల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇకపై నెలనెలా గ్యాస్ ధరలు పెంచవద్దని చమురు సంస్థలను ఆదేశించింది.