Pranav Dhanvade: ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగులు కొట్టిన ధనవాడే... అదే అతనికి శాపం!

  • ఒత్తిడి పెరిగి పరుగులు చేయలేని స్థితిలో ప్రణవ్ ధనవాడే
  • రెండేళ్ల క్రితం ఒక్కసారిగా ఆకాశానికి - అంతే వేగంతో పాతాళానికి
  • ఫామ్ కోల్పోవడంతో ప్రాక్టీసుకు కూడా రానివ్వని క్లబ్ లు
  • తిరిగి క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామన్న కోచ్, స్నేహితులు

జూనియర్ సచిన్ టెండూల్కర్... భారత క్రికెట్ కు భవిష్యత్ ఆశాదీపం... ఇవి రెండేళ్ల క్రితం 16 ఏళ్ల వయసులో ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా 1009 పరుగులు కొట్టిన ప్రణవ్ ధనవాడేకు వచ్చిన పొగడ్తలు. మాస్టర్ బ్లాస్టర్ సైతం ప్రణవ్ ను అభినందిస్తూ, స్వయంగా సంతకం చేసిన బ్యాట్ ను పంపించాడు. ఎంతో మంది ప్రముఖ క్రికెటర్లు తమవంతు అభినందనలు పంపారు. మీడియా ప్రణవ్ ను ఆకాశానికి ఎత్తేసింది. అదే అతనికి శాపమైంది.

అతి ప్రచారం అతని ఏకాగ్రతను దెబ్బతీసింది. అపరిమితమైన అంచనాలు, ఆటలో పదును తగ్గడంతో అతని బ్యాట్ ఎంతమాత్రమూ పరుగులు చేయలేకపోతోంది. ఎలాగంటే, నాడు కొట్టిన 1000లో కనీసం పదో వంతు ప్రదర్శన కూడా చేయలేనంత. ఒత్తిడి నానాటికీ పెరుగుతుంటే, ప్రణవ్ మానసికంగా కుంగిపోయాడు. ఆడటం తనకిక చేతగాదని చెబుతూ బ్యాట్ విడిచి పెట్టాడు.

గత ఏడాదిన్నరగా క్రికెట్ లో పరుగులు సాధించడంలో విఫలమవుతుండటంతో ఎయిర్ ఇండియా, దాదర్ యూనియన్ క్లబ్ తదితరాలు కనీసం ప్రాక్టీస్ చేసేందుకు కూడా తమ గ్రౌండ్లలోకి రానివ్వలేదు. దీంతో ప్రణవ్ ఆటకు పూర్తిగా దూరమయ్యాడు. తనకు మార్గనిర్దేశం చేసేవారు కరవయ్యారని వాపోయాడు. ఇక అతనిలో క్రీడాస్ఫూర్తిని తిరిగి నింపేందుకు కోచ్ మోబిన్ షేక్ తో పాటు స్నేహితులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం.

Pranav Dhanvade
Club Cricket
1000 runs
  • Loading...

More Telugu News