TTV Dinakaran: దినకరన్ గెలుపునకు కారణాలు బోలెడు.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఇదీ..!

  • బీజేపీతో ప్రభుత్వం సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన  ప్రజలు
  • సానుభూతి కూడా దినకరన్ గెలుపునకు ఓ కారణం
  • ప్రజల్లో ఉంటూ సొంత డబ్బుతో పేదల రుణాలు తీర్చడం మరో కారణమంటున్న విశ్లేషకులు

ఆర్కే నగర్‌లో దినకరన్‌ను ‌గెలిపించి తమిళ ప్రజలు ఎవరూ ఊహించని తీర్పు ఇచ్చారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన దినకరన్ జైలుకు కూడా వెళ్లివచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఒక్కటై బోల్డంత బలం సమకూర్చుకున్నప్పటికీ, ఇవేవీ దినకరన్‌ను ఓడించలేకపోయాయి. అంతేకాదు.. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన జయలలిత కంటే ఎక్కువ మెజారిటీతో దినకరన్ గెలుపొందారు.

 దినకరన్ గెలుపు దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చ అయింది. ఆయన గెలుపునకు కారణాలను విశ్లేషించిన రాజకీయ పండితులు పలువురు పలు విషయాలను వెల్లడించారు. దినకరన్‌పై బహిష్కరణ వేటు వేయడంతో ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరిగిందని చెబుతున్నారు. అలాగే పదవులను కాపాడుకునేందుకు ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఒక్కటి కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు.

దీనికి తోడు దినకరన్ జైలు  నుంచి వచ్చాక ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నేతలు, కార్యకర్తలను చేరదీశారు. సొంత డబ్బులతో స్థానిక ప్రజల రుణాలను తీర్చారు. ఇవన్నీ దినకరన్ గెలపునకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఎన్నికలకు ముందు జయ ఆసుపత్రిలో ఉన్న వీడియోను వ్యూహాత్మకంగా విడుదల చేయడం కూడా ఆయన గెలుపునకు ఓ కారణమని చెబుతున్నారు. అలాగే తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యాన్ని సహించలేని ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని భావిస్తున్నారు. పళని ప్రభుత్వం బీజేపీతో అంటకాగడాన్ని ఇష్టపడని ప్రజలు దినకరన్‌ను భారీ మెజార్టీతో గెలిపించారని చెబుతున్నారు.

TTV Dinakaran
Tamilnadu
RK Nagar
  • Loading...

More Telugu News