subramanian swamy: పాక్ ను నాశనం చేద్దాం.. ముక్కలు ముక్కలుగా నరుకుదాం.. పదండి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి
- పాక్ పై యుద్ధం ప్రకటించాలన్న సుబ్రహ్మణ్యస్వామి
- నాలుగు ముక్కలుగా నరకాలి
- యుద్ధం సంభవించినా ఏ దేశం కూడా కల్పించుకోదు
పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న కుల్ భూషన్ జాధవ్ ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యలకు పాక్ లో అవమానం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పట్ల పాక్ భద్రతా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. వారి దుస్తులను మార్పించి వేరే దుస్తులు వేసుకోమనడం, మంగళసూత్రాలు, గాజుల్ని తీయించడం, బొట్టును తీసేయమనడం, పాదరక్షలను తొలగించమనడం, మాతృ భాషలో సంభాషించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకోవడంలాంటి దుశ్చర్యలకు దిగారు. చివరకు జాధవ్ భార్య మంగళసూత్రాలు, పాద రక్షలను కూడా పాక్ అధికారులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై భారత ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పాకిస్థాన్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. నీచంగా ప్రవర్తించిన పాక్ పై యుద్ధం ప్రకటించాలంటూ మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాక్ ను నాలుగు ఖండాలుగా తెగనరకాలని అన్నారు. ఇప్పటికిప్పుడే యుద్ధానికి వెళ్లాలని తాను చెప్పడం లేదని... కానీ, యుద్ధానికి సంబంధించిన సీరియస్ గ్రౌండ్ వర్క్ ను మాత్రం వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని... అయితే, ఇది పార్టీ అభిప్రాయంగా కూడా మారే అవకాశం కూడా ఉందని అన్నారు. పాక్ పై సర్జికల్ స్ట్రయిక్స్ సరైనవేనని... అయితే, ఇవి దీర్ఘకాల పరిష్కారాన్ని ఇవ్వలేవని... ఈ సమస్యకు పరిష్కారం పాకిస్థాన్ ను ముక్కలు చేయడమేనని చెప్పారు. పాకిస్థాన్ తీరుతో ప్రపంచ దేశాలు కూడా విసిగిపోయాయని, ఒకవేళ భారత్-పాక్ మధ్య యుద్ధం సంభవించినా ఏ దేశం కూడా అందులో కల్పించుకోదని అన్నారు.