High Court: కోర్టు ఉత్తర్వులంటే జోక్ అయిపోయింది.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై హైకోర్టు ఫైర్!
- పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై ఆగ్రహం
- జోక్‌గా తీసుకోవద్దని హెచ్చరిక
- తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ధర్మాసనం
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు మండిపడింది. కోర్టుల ఉత్తర్వులంటే ప్రభుత్వాలకు జోక్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ ప్రాజెక్టులు, అవసరాల కోసం భూమిని సేకరిస్తున్న ప్రభుత్వాలు పరిహారం చెల్లింపులో చేస్తున్న జాప్యంపై హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. కోర్టుల ద్వారా బాధితులు పరిహారం పెంపు ఉత్తర్వులను తెచ్చుకుంటున్నప్పటికీ అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
ప్రభుత్వాల తీరు మారకుంటే పరిహారం చెల్లించిన తర్వాతే భూసేకరణ జరిపేలా ఆదేశాలివ్వాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అలా కూడా కాని పక్షంలో ఏకంగా భూసేకరణ ప్రక్రియనే నిలిపి వేసేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. కోర్టులు జారీ చేసిన భూసేకరణ పరిహారం ఉత్తర్వుల అమలు వివరాలను నాలుగు వారాల్లోగా అందజేయాల్సిందిగా రెండు ప్రభుత్వాల సీఎస్‌లను ఆదేశించింది. లేదంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
భూసేకరణ పరిహారం విషయంలో తాము ఇస్తున్న ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అమలు చేయడం లేదని, ఫలితంగా ఉత్తర్వుల అమలు కోసం బాధితులు పెట్టుకుంటున్న ‘ఎగ్జిక్యూషన్ పిటిషన్లు’ కుప్పలుతెప్పలుగా ఏళ్ల తరబడి పేరుకుపోతున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జిం.వెంకటకృష్ణయ్య ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై వ్యాఖ్యలు చేసింది.