Chandrababu: 45% అవార్డులు ఆంధ్రప్రదేశ్ కే దక్కడం గర్వ కారణం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

  • నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
  • దేశ వ్యాప్తంగా 83 గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు 
  • అందులో 31 అవార్డులు మన రాష్ట్రానికే దక్కాయి
  • ఈ స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించాలి

గాలిస్వచ్ఛత (ఎయిర్ క్వాలిటి)పై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. ఈ రోజు నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల‌కు ప‌లు ఆదేశాలు జారీ చేశారు. ‘నీటి సమస్య అధిగమించాం, మిగులు విద్యుత్ సాధించాం,ఇక కాలుష్య సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఫిన్లాండ్ తరహాలో మన రాష్ట్రంలో గాలి స్వచ్ఛత (ఎయిర్ క్వాలిటి)పై శ్రద్ధ వహించాలి. వాయు, జల కాలుష్య సమస్యల పరిష్కారంపై యాక్షన్ ప్లాన్ తయారుచేయాలి’ అని చంద్రబాబు అన్నారు.
 
కృష్ణా, గుంటూరు, విశాఖ పట్టణం, విజయ నగరం జిల్లాలలో కాలుష్య సమస్య పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయ వ్యర్ధాలను తగులబెట్టే పద్ధ‌తులకు స్వస్తి చెప్పాలని అన్నారు. రాయలసీమ జిల్లాలలో గాలిస్వచ్ఛత బాగుందని రియల్ టైం గవర్నెన్స్ సీఈవో అహ్మద్ బాబు,ఇస్రో రాజశేఖర్ వివరించగా ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సీమ జిల్లాలకు నీళ్లిచ్చామని, పండ్లతోటలు అభివృద్ధి చేశామ‌ని అందుకే రాయలసీమలో జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని అభిప్రాయబడ్డారు. కాలుష్య సమస్య పరిష్కారంపై అటవీ, పంచాయతీ రాజ్ శాఖలు, కాలుష్య నియంత్రణ సంస్థ, పోలీస్, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్లు సమన్వయంగా పనిచేయాలన్నారు.

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పలు విభాగాల్లో 83 గ్రామాలకు అవార్డులు ఇస్తే అందులో 31 అవార్డులు మన రాష్ట్రానికే దక్కడం అందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 45% అవార్డులు ఆంధ్రప్రదేశ్ కే దక్కాయని, ఈ స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో దేశంలోనే ముందున్నామని తెలిపారు. ప్రతి నెలా వాటర్ ఆడిటింగ్ పై నివేదికలు ఇవ్వాలని సూచించారు. శ్రీకాకుళంలో లక్షఎకరాలకు అదనంగా నీళ్లివ్వడం గొప్ప విజయమని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో రబీలో పంటలకు తొలిసారిగా నీళ్లిచ్చాం..

శ్రీకాకుళం జిల్లాలో రబీలో పంటలకు తొలిసారిగా నీళ్లివ్వగలగడం పట్ల చంద్రబాబు సంతృప్తి వ్య‌క్తం చేశారు. శ్రీకాకుళంలో ఈ రబీ సీజన్ లో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీటిని అందించడం నిజంగా గొప్ప విజయంగా పేర్కొన్నారు. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్లే రబీ సాగు విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాల నుంచి 3.5 లక్షల ఎకరాలకు పెంచగలిగామన్నారు. ఈ రెండింటి ద్వారానే 75 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన విషయం గుర్తు చేశారు.ఈ ఏడాది ఖరీఫ్ లో కూడా పంటల దిగుబడులు గణనీయంగా పెరిగిన విషయం ప్రస్తావించారు. విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలలో వ్యవసాయాభివృద్ధే వలసలకు పరిష్కారంగా తెలిపారు. తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్న ఈ
రెండు జిల్లాలు అగ్రగామి కావాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు.

కాలుష్య సమస్య అధిగమించాలి-జీవన ప్రమాణాలు పెరగాలి..
‘రాష్ట్రంలో ఎక్కడా తెగుళ్ల బెడద ఉండొద్దు, దిగుబడుల నాణ్యత దెబ్బతినరాదు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి, కాలుష్య సమస్య అధిగమించాలి. సేంద్రియ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలి, నాణ్యమైన దిగుబడులు రావాలి, ఉత్పాదకత పెరగాలి, ప్రజారోగ్యం పెంపొందాలి, జీవన ప్రమాణాలు పెరగాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News