ks kandasami: విద్యార్థినిలో ప్రేరణ కల్పించేందుకు అనూహ్య నిర్ణయం తీసుకున్న జిల్లా కలెక్టర్!

  • కలెక్టర్ కావాలనుకుంటున్నానన్న విద్యార్థినిని తన కారులో కూర్చోబెట్టిన కలెక్టర్
  • కారు వెలుపల నిలబడి ఫొటో
  • ఈ ఫొటో ద్వారా స్ఫూర్తిని పొందాలంటూ ఆశీర్వాదం

తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా కలెక్టర్ కేఎస్ కందసామి చేసిన ఒక పని ఎందరిలోనే స్ఫూర్తిని నింపుతోంది. వివరాల్లోకి వెళ్తే, పదో తరగతి పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేసే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా, మీ జీవిత లక్ష్యాలు ఏంటో చెప్పాలంటూ విద్యార్థులను కలెక్టర్ అడిగారు. దీనికి సమాధానంగా, తాను కలెక్టర్ కావాలనుకుంటున్నట్టు మనీషా అనే విద్యార్థిని చెప్పింది. టెన్త్ క్లాస్ లో ఆమె 500 మార్కులకు గాను 491 మార్కులు సాధించింది.

గ్రామీణ ప్రాంతానికి చెందిన మనీషా ఎంతో ధైర్యంగా చెప్పిన సమాధానంతో కందసామి పులకించిపోయారు. బహుమతుల ప్రదానం అనంతరం ఆ చిన్నారిని ఆయన స్వయంగా తన కారులోని తన సీటులో కూర్చోబెట్టి, ఆయన వాహనం బయట నిలబడి ఫొటో దిగారు. అనంతరం ఒక ఫొటో కాపీని ఆమెకు ఇచ్చారు. 'నీవు నీ జీవిత లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఈ ఫొటో నుంచి స్ఫూర్తిని పొందాలి' అంటూ ఆశీర్వదించారు. మనీషా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలతో 11వ తరగతి చదువుతోంది. అనంతరం మనీషా మాట్లాడుతూ, కలెక్టర్ కారులో కూర్చోవడం తనకు భావోద్వేగాన్ని కలిగించిందని... ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. మరోవైపు, కలెక్టర్ తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. 

  • Loading...

More Telugu News