Telugudesam: నాడు రేవంత్ కు అంతపెద్ద అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదు: మోత్కుపల్లి నర్సింహులు
- నాడు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ను నియమించకుండా ఉండాల్సింది
- పార్టీ చేసిన చిన్నపొరపాటు
- రేవంత్ రెడ్డి నాయకుడే కాదు: మోత్కుపల్లి విమర్శలు
మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఇటీవలే ఆ పార్టీని వీడిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శలు గుప్పించారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని నాడు నియమించడం పార్టీ చేసిన చిన్నపొరపాటని, అంతపెద్ద అవకాశం ఆయనకు ఇచ్చి ఉండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియా హైలైట్ చేయడం వల్లే ఆయనకు అంత గుర్తింపు వచ్చింది తప్పా, ఆయన అసలు నాయకుడే కాదని విమర్శించారు.
సామాన్య ప్రజలతో మాట్లాడని వ్యక్తి, ఫోన్ చేస్తే స్పందించని వ్యక్తి నాయకుడెలా అవుతాడని ఎద్దేవా చేశారు. నాడు రేవంత్ వ్యవహారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి పలుసార్లు తీసుకెళ్లానని, అయితే, రేవంత్ పై బాబుకు అప్పట్లో నమ్మకం ఉండటం వల్లే ఆయనకు పెద్ద పదవి దక్కిందని చెప్పుకొచ్చారు. అంతపెద్ద అవకాశం లభిస్తే ఆ పదవిని పార్టీ అభివృద్ధికి కాకుండా, స్వప్రయోజనాలకు వాడుకున్నాడని మోత్కుపల్లి విమర్శల వర్షం కురిపించారు.