Hyderabad: ఆదివారం కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. 1.25 లక్షలమంది ప్రయాణం!
- వారాంతాల్లో కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లు
- 26 రోజుల్లో 25 లక్షల మంది ప్రయాణం
- వేగంపై పెదవి విరుస్తున్న ప్రయాణికులు
ఆదివారం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మిగతా రోజుల సంగతెలా ఉన్నా వీకెండ్స్‌లో మెట్రోకు బాగానే ఆదాయం సమకూరుతోంది. చార్జీల గురించి ఏమాత్రం పట్టించుకోని నగరవాసులు మెట్రో ఎక్కి మురిసిపోతున్నారు. ఆదివారం ఒక్క రోజే 1.25 లక్షల మంది మెట్రోలో ప్రయాణించినట్టు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే సాధారణ రోజుల్లో మాత్రం మెట్రో వైపు చూసే వారు చాలా తక్కువగా ఉండడం గమనార్హం.
గత నెల 29న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభమైంది. ఇప్పటి వరకు 25 లక్షల మంది ప్రయాణించారు. సగటున ప్రతి పది నిమిషాలకో రైలును నడుపుతున్నారు. మియాపూర్-అమీర్‌పేట, నాగోల్-అమీర్‌పేట కారిడార్లలో రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణం మంచి అనుభూతినే ఇస్తున్నా రైలు వేగం మాత్రం మరీ దారుణంగా ఉందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 27.6 కిలోమీటర్ల దూరానికి గంటకుపైగా సమయం పడుతోందని చెబుతున్నారు. విపరీతమైన ట్రాఫిక్ ఉన్న సమయాల్లో బస్సులోనూ ఇంత సమయం పట్టడం లేదని అంటున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగానే ప్రస్తుతం మెట్రో రైలు వేగాన్ని తగ్గించి నడుపుతున్నామని, త్వరలోనే వాటిని అధిగమించి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడుపుతామని మెట్రో అధికారులు పేర్కొన్నారు.