India: ఉత్కంఠభరిత పోరులో భారత్‌దే విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్!

  • మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత్ క్లీన్ స్వీప్
  • 2017ను విజయంతో ముగించిన భారత్
  • చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్

శ్రీలంక ఆశలు అడియాసలయ్యాయి. భారత్ అనుకున్నది సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్‌ను కూడా భారత్ గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 భారత్ వశమైంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల  సిరీస్ క్లీన్ స్వీప్ అయింది. ఈ మ్యాచ్‌నైనా గెలుచుకుని పరువు నిలబెట్టుకోవాలని ఆశించిన లంకేయులకు నిరాశే మిగిలింది. ఇక ఈ ఏడాదిని విజయంతో ముగించాలన్న రోహిత్ సేన లక్ష్యం నెరవేరింది.

ఆదివారం శ్రీలంకతో జరిగిన చివరి టీ20 అభిమానులకు మజా పంచింది. ఇప్పటి వరకు జరిగినవి దాదాపు వన్‌సైడ్‌ మ్యాచులు కాగా, చివరిసారి శ్రీలంక తొలిసారి గట్టి పోటీ ఇచ్చింది. చివరి వరకు నువ్వా? నేనా? అన్నట్టు జరిగిన పోరులో చివరికి భారత్‌దే పైచేయి అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తడబడుతున్నట్టు కనిపించింది. దీంతో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. చివరికి భారత్‌నే వరించింది. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

లక్ష్యం చిన్నదే అయినా భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నాలుగో ఓవర్ రెండో బంతికే ఓపెనర్ రాహుల్ (4) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడన్న ధీమా కూడా ఎక్కువ సేపు నిలవలేదు. 27 పరుగుల వ్యక్తిగత  స్కోరు వద్ద రోహిత్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో స్కోరు వేగం మందగించింది. శ్రేయాస్ అయ్యర్ (30), మనీష్ పాండే (32) సమన్వయంతో ఆడుతున్న సమయంలో చమీర బౌలింగ్ లో మనీష్ పాండే అవుటయ్యాడు.

ఆ వెంటనే వచ్చిన హార్ధిక్ పాండ్యా కూడా అవుటవడంతో భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆఖరి ఓవర్ వరకు ఫలితం దోబూచులాడింది. చివరికి దినేశ్ కార్తీక్ (18 నాటౌట్), మిస్టర్ కూల్ ధోనీ (16 నాటౌట్)  కలిసి పని పూర్తి చేసి, అభిమానుల ఆందోళనను తగ్గించారు. భారత్‌కు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించారు. శ్రీలంక బౌలర్లలో దుష్మంత చమీర, దాసున్ శంక చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే అసెల గుణరత్నె (36), సమరవిక్రమ (21), దాసున్ శంక (29)లు భారత బౌలర్లను ఎదురొడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, హార్ధిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసుకోగా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. జయదేవ్ ఉనద్కత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ గా ఎంపికయ్యాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News