: షారూఖ్ పై ప్రేమ చూపుతున్న ముంబయి 'రాజ్'


మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే.. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు బాసటగా నిలిచారు. షారూఖ్ ను వాంఖెడే మైదానంలోకి అనుమతించాలని రాజ్ డిమాండ్ చేశారు. షారూఖ్ ఏమీ ఉగ్రవాది కాడని ముంబయి క్రికెట్ వర్గాలకు హితవు పలికారు. గత ఐపీఎల్ సీజన్ లో షారూఖ్ వాంఖెడే భద్రత సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీంతో, అతనిపై ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) వాంఖెడేలో ప్రవేశించకుండా నిషేధం విధించింది.

అయితే, కొద్దిరోజుల క్రితం షారూఖ్ ఆనాటి సంఘటనపై బహిరంగ క్షమాపణ తెలిపారు. తాను చేసింది తప్పేనని అంగీకరించారు. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే స్పందించారు. నేడు ముంబయిలో మాట్లాడుతూ, 'షారూఖ్ ఖాన్ ఓ క్రిమినల్ కాదు, టెర్రరిస్టు అంతకన్నా కాదు. వాంఖెడేలోకి అతన్ని అనుమతించాలి. తప్పు ఒప్పుకున్నప్పుడు క్షమించాలి కదా?' అని ప్రశ్నించారు.

కాగా, షారూఖ్ పై ఐదు మ్యాచ్ ల నిషేధం విధించిన ఎంసీఏ.. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునే అవకాశాలు కనిపించడంలేదు. దీంతో, కోల్ కతా నైట్ రైడర్స్-ముంబయి ఇండియన్స్ పోరును షారూఖ్ ప్రత్యక్షంగా వీక్షించడం కుదరదు. ఇక ఆయన బయటి నుంచే తన జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ను ప్రోత్సహించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News