kcr: క్రిస్టియన్లకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి!: రేవంత్ రెడ్డి డిమాండ్
- కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి
- క్రిస్టియన్ భవన నిర్మాణానికి వివాదాస్పద స్థలం కేటాయించారు
- అలా చేయడం క్రిస్టియన్లను అవమానించడమే
సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రెండు సార్లు వివాదాస్పద స్థలం కేటాయించారని, ఇది క్రిస్టియన్లను అవమానించడమేనని .. వారికి క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి వెంటనే 10 ఎకరాల వివాదరహిత భూమిని కేటాయించాలని, భవన నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించాలని, వచ్చే క్రిస్మస్ నాటికి దీని నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండగ తరహాలోనే ‘క్రిస్మస్ ట్రీ’ సంబరాలను నిర్వహించాలని, క్రిస్టియన్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని తక్షణం నెరవేర్చాలని ఆ లేఖలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాగా, మల్కాజ్‌గిరి గ్రామానికి చెందిన మహేంద్రహిల్స్ సర్వే నెంబర్ 844/1 లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆదేశాలివ్వడంతోపాటు 2014, డిసెంబర్ 23న ఆ భూమిలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేసిన విషయాన్ని లేఖలో రేవంత్ ప్రస్తావించారు. ఆ స్థలం వివాదంలో ఉండటంతో ఈసారి అల్వాల్ మండలంలోని యాప్రాల్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 124/B లో 04.12.2017 న క్రిస్టియన్ భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో శంకుస్థాపన చేయించారని, అది కూడా వివాదాస్పద స్థలమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయా ఫొటోలను రేవంత్ రెడ్డి తన పోస్ట్ లో జతపరచడం గమనార్హం.