laxmareddy: వ్యక్తిగత విమర్శలు చేయవద్దని రేవంత్‌రెడ్డిని హెచ్చరిస్తున్నా: మంత్రి లక్ష్మారెడ్డి
- నిన్న సాయంత్రం జడ్చర్లలో టీపీసీసీ భారీ బహిరంగ సభ
- టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ చేసిన విమర్శలపై మండిపడ్డ లక్ష్మారెడ్డి
- కుటుంబపాలన గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు
- కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి అనే కొత్తజోకర్ చేరాడు
నిన్న సాయంత్రం జడ్చర్లలో టీపీసీసీ భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించింది. తెలంగాణలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే టీడీపీలో ఓ బలమైన నాయకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తమ పార్టీలో చేరారని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన ఉందని విమర్శించారు. తమ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉంటూ జడ్చర్ల జనగర్జన తరహాలోనే తెలంగాణలోని 100 నియోజకవర్గాలకు పైగా జనగర్జన సభలు నిర్వహించబోతున్నామని కాంగ్రెస్ నేతలు అన్నారు.
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లలో కాంగ్రెస్ సభ అట్టర్‌ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. కుటుంబపాలన గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని అన్నారు. కాంగ్రెస్‌లో కొత్తజోకర్ చేరాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి లక్ష్మారెడ్డి అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని తాను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నానని, తాము రేవంత్ రెడ్డిలా దొంగ వ్యాపారాలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.