Pawan Kalyan: ఓటమి గురించి పవన్ పదేపదే ఎందుకు మాట్లాడుతున్నారు?

  • పవన్ ఓటమి వ్యాఖ్యలపై విశ్లేషణలు మొదలు
  • రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టకముందు ఓటమి వ్యాఖ్యలు
  • రాజకీయ, సినీ వర్గాల్లో జోరుగా చర్చ

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల నోరు విప్పితే చాలు ఓటమి గురించి మాట్లాడుతున్నారు. తనకు ఓటమి అంటే భయం లేదని పదేపదే చెబుతున్నారు. ఇటీవల ఏపీలో పర్యటించినప్పుడు, తాజాగా ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్‌లోనూ ఓటమి గురించి ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ ‘ఓటమి’ గురించి అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌లో పవన్ మాట్లాడుతూ తాను పాప్యులర్ అవుతున్నకొద్దీ తనను ద్వేషించే వాళ్లు ఎవరో తెలిసిందని పవన్ పేర్కొన్నారు. దేశం కోసం ఏదో చేయాలన్న తపనే తనను రాజకీయాల వైపు మళ్లించిందన్నారు. తనకు ఓటములు కొత్త కాదని, కానీ ఓడిపోయే ముందు పెద్ద దెబ్బే కొడతానని అన్నారు. అజ్ఞాతవాసి పూర్తిగా సినీ వేడుక కావడంతో రాజకీయాల గురించి పవన్ ఇంతకు మించి మాట్లాడకపోయినా.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టకముందే ఆయన ఓటమి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్న చర్చ ప్రారంభమైంది.

ఓటమి గురించి ముందే తెలిసిన వారు కూడా గంభీరంగా ఉంటారు. తమ సైన్యం (కార్యకర్తలు)లో నమ్మకం కలిగిస్తారు. కానీ రంగంలోకి దిగకముందే పవన్ ఓటమిని అంగీకరించడం వెనక తాను రాజకీయాలకు సూటవనన్న సంకేతం కూడా అంతర్లీనంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

సాధారణంగా పవన్ ఎక్కడ మాట్లాడినా తన సినిమాల గురించి, వ్యక్తిగత అభిరుచుల గురించి మాట్లాడతారు. కానీ ఈసారి ఓటమి గురించి, తనను ద్వేషించే వారి గురించి మాట్లాడారు. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ మళ్లీమళ్లీ ప్రయత్నించి విజయం సాధిస్తానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు. తనను ద్వేషించే వాళ్లు ఎక్కువయ్యారని పేర్కొన్నారు. ఆయన మాటలను విశ్లేషించిన వారు ఇటీవల జిల్లాల పర్యటనకు వచ్చిన ప్రతిస్పందనలకే ఈ రకంగా సమాధానం చెప్పి ఉంటారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆయన వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

  • Loading...

More Telugu News