స్మృతి ఇరానీ: నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు, అందుకే, ఈ వదంతులు: స్మృతి ఇరానీ
- గుజరాత్ సీఎం రేసులో నేను లేను
- ఈ వదంతులు అబద్ధాలు..నమ్మకండి
- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
గుజరాత్ సీఎం రేసులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉన్నారనే వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆమె స్పందిస్తూ, ‘చాలామంది నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. అందుకే, ఈ వదంతులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు’ అన్నారు. గుజరాత్ సీఎం రేసులో తాను లేనని, ఆ వదంతులు అబద్ధాలని.. వాటిని నమ్మొద్దని కేంద్ర మంత్రి, గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీ అయిన ఆమె అన్నారు.
కాగా, ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ రూపానీని సీఎంగా చేయాలని బీజేపీ అనుకుంది కానీ, తుదినిర్ణయం ప్రకటించాల్సి ఉంది. గుజరాత్ సీఎం ఎవరనే విషయమై వచ్చే ఆదివారం బీజేపీ ఓ ప్రకటన చేయనుందని, సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గుజరాత్ లో ఏర్పాటు చేయనున్న కొత్త ప్రభుత్వంలో పటేళ్లు, బీసీలు, ఓబీసీలు, దళిత కులాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.