Andhra Pradesh: ఆ మూడు ప్రాంతాల్లో రాష్ట్రపతి పర్యటిస్తారు.. ఏర్పాట్లన్నీ స‌మ‌ర్థ‌వంతంగా ఉండాలి: ఏపీ సీఎస్‌

  • అమ‌రావ‌తిలో ఈనెల 27న భారత రాష్ట్రపతి పర్యటన
  • ఏర్పాట్లపై ఏపీ సీఎస్ స‌మీక్ష‌
  • ముందుగా నాగార్జున వర్శిటీ కార్యక్రమానికి హాజరు 
  • సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం సందర్శన  

భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఈనెల 27వ తేదీన అమరావతిలోని సచివాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద జరిగే కార్యక్రమాలలో పాల్గొన‌నున్న నేప‌థ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్ సమీక్షించారు. ఈ మేరకు ఈ రోజు అమరావతి సచివాలయంలోని త‌న‌ కార్యాలయంలో డీజీపీ సాంబశివరావుతో పాటు ప‌లువురు అధికారుల‌తో దినేశ్ కుమార్ చ‌ర్చించారు.

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేని రీతిలో ఆయా శాఖలవారీ చేయాల్సిన ఏర్పాట్లను సక్రమంగా, పటిష్టంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 27వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్ లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తర్వాత హెలికాప్టర్ ద్వారానే అమరావతి సచివాలయ ప్రాంగణంకు చేరుకుని, ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారని అన్నారు.

అనంతరం సచివాలయం మొదటి బ్లాకులో రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాల్లో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ పటిష్టవంతంగా చేయాలని సీఎస్‌ దినేశ్‌ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ ఎన్.సాంబశివరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్, సీఆర్డిఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్.అనురాధ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, గుంటూరు, కృష్ణా, జిల్లాల కలక్టర్లు కె.శశిధర్, బి.లక్ష్మీకాంతం, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News