KCR: అప్పట్లో ఇదే స్టేడియంలో ఒక మూలన కూర్చుని తెలుగు మహాసభల్ని చూశాను: కేసీఆర్
- ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం
- అది 1974.. ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి
- డిగ్రీ కాలేజీ విద్యార్థిగా వచ్చి చూశాను
- ఈ సభలు విజయవంతం అయినందుకు సంతోషంగా ఉంది
'ఒక రోజు డిగ్రీ కాలేజీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ఒకమూలన కూర్చుని నేను ప్రపంచ తెలుగు మహాసభలను తిలకించాను.. అది 1974' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఐదు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలు కాసేపట్లో ముగియనున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ముగింపు వేడుకల్లో కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా మన సాహితీవైభవాన్ని ప్రపంచానికి చాటుకున్నామని అన్నారు.
సభలు విజయవంతం అయినందుకు, ఆశించిన లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా గురు పూజతో ప్రారంభించి సంస్కారవంతంగా సభల్ని ప్రారంభించుకున్నామని, ఈ రోజు ముగింపు సమావేశానికి తమ ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రపతి వచ్చారని వారికి హృదయపూర్వక ధన్యవాదాలని కేసీఆర్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మన భాషను గౌరవించుకోవడమే కాకుండా ఇతర భాషల జ్ఞానపీఠ్ అవార్డుల గ్రహీతలను కూడా సత్కరించామని తెలిపారు.