మంత్రి జగదీష్ రెడ్డి: ఒక భాషపై మరో భాష ఆధిపత్యం చేయడం సరికాదు: మంత్రి జగదీష్ రెడ్డి
- పలు భాషలతో పాటు తెలుగు కూడా నిరాదరణకు గురైంది
- మన భాష ను మనమే ఆదరించాలి
- తెలుగు మహాసభల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
ఒక భాషపై మరో భాష ఆధిపత్యం చేయడం సరికాదని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఈరోజు తెలుగు యూనివర్సిటీలోని సామల సదాశివ వేదికలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణలో తెలుగు – భాష సదస్సు’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా మన భాషను మనమే అభిమానించి, ఆదరించినప్పుడే ఇంకొకరు మన వెంట నడుస్తారని, ఈ విషయాన్ని ప్రతి తెలుగు వ్యక్తి గుర్తుంచుకోవాలని కోరారు. మన తల్లి భాషను బతికించుకోవడానికి ముందుగా మన ఇండ్లలో వారసత్వంగా వచ్చిన భాషను ముందు తరం వారికి అందించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో పలు భాషలతో పాటు మన భాష కూడా నిరాదరణకు గురైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభలు తెలుగు భాషకు మరింత ప్రోత్సాహం, ఉత్సాహం ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. అంతకుముందు, ఈ అంశంపై పలువురు సాహితీవేత్తలు తమ అభిప్రాయాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నారెడ్డిని సన్మానించారు. అనంతరం పలువురు కవులు రాసిన పుస్తకాలను, సి.డి.లను ఆవిష్కరించారు.