: మైకేల్ జాక్సన్ పిల్లలకు తండ్రెవరు.. ?
చిరుత ప్రాయంలోనే సంగీత ప్రపంచంలో తిరుగులేని స్థానాన్ని స్వంతం చేసుకున్న పాప్ రారాజు మైకేల్ జాక్సన్ ను మరణానంతరం కూడా వివాదాలు వదలడంలేదు. మైకేల్ జాక్సన్ ముగ్గురు పిల్లలకు అసలు తండ్రెవరంటూ అమెరికా పత్రిక డైలీస్టార్ తాజాగా వెలువరించిన కథనం సంచలనం రేకెత్తిస్తోంది. ప్రిన్స్ మైకేల్, ప్యారిస్, బ్లాంచెట్ లకు మైకేల్ తండ్రి కానేకాదని డైలీస్టార్ అంటోంది.
ప్రపంచంలో వివిధ రంగాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి వీర్యాలను సేకరించి వాటి ద్వారా సంతానం పొందాడని డైలీస్టార్ పేర్కొంది. అందం, తెలివి, చురుకుదనం విషయంలో తన పిల్లలు తనకంటే మెరుగ్గా ఉండాలని మైక్ భావించాడని పత్రిక తెలిపింది. విపరీతమైన మాదకద్రవ్యాల వాడకం కారణంగా తన వీర్యం బలహీనపడిందన్న అనుమానంతో ఈ పాప్ కింగ్ వీర్య దాతల ద్వారా సంతానం పొందాడని డైలీస్టార్ అంటోంది.
ఇలా పొందిన వీర్యాన్ని ఓ ప్రపంచ ప్రఖ్యాత జన్యు ఇంజినీరింగ్ సంస్థ ద్వారా మాజీ భార్య డెబ్బీ రో అండాలతో ఫలదీకరణం చెందించినట్టు కూడా ఈ పత్రిక వెల్లడించింది. ఇక ఆఖరుదైన బ్లాంచెట్ మాత్రం సర్రోగేట్ మదర్ ద్వారా పుట్టినట్టు పేర్కొంది. ఇదిలావుంటే, మైకేల్ జాక్సన్ పిల్లలకు తామే అసలు తండ్రులమని ఆరుగురు ముందుకొచ్చారు. వారిలో ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు మార్క్ లెస్టర్ కూడా ఉండడం విశేషం.