Narendra Modi: కేసీఆర్ మాదిరి మీరిద్దరూ గుజరాత్ లో రాక్షస క్రీడ ఆడారు!: మోదీపై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి

  • మోదీ ప్రచారమంతా అబద్ధాలమయం
  • అయ్యర్ వ్యాఖ్యలకు కులం రంగు పులిమారు
  • మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది

ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడానికి మోదీ దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. పాకిస్థాన్ తో కలసి తనను హత మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నిందంటూ అబద్ధపు ప్రచారాలు చేశారని విమర్శించారు. మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయిందంటూ ఎద్దేవా చేశారు.

కులం, మతం, అబద్ధాల ప్రాతిపదికగానే మోదీ ప్రచారం కొనసాగిందని అన్నారు. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు మోదీ కులం రంగు పులిమారని ధ్వజమెత్తారు. గుజరాత్ ఎన్నికల్లో అభివృద్ధి నినాదమే వినిపించలేదని అన్నారు. బీజేపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ పైవ్యాఖ్యలు చేశారు.

ఇంతగా దిగజారిన ప్రధానమంత్రిని తాను ఇంతవరకు చూడలేదని రేవంత్ అన్నారు. వాజ్ పేయి హయాంలో ఒక్క ఎంపీని కొనుగోలు చేసి ఉంటే ఎన్డీయే ప్రభుత్వం నిలబడి ఉండేదని... కానీ ఆయన అలా చేయలేదని అన్నారు. మోదీ, అమిత్ షాలు మాత్రం ఎంతకైనా దిగజారుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాదిరి వీరిద్దరూ గుజరాత్ లో రాక్షస క్రీడ ఆడారని అన్నారు.

సొంత ఊరిలో ఓడిన మోదీ గెలిచినట్టా? లేదా ఓడినట్టా? అని ప్రశ్నించారు. ఒక్క రాహుల్ గాంధీని ఓడించడానికి 182 మంది బీజేపీ నేతలు కష్టపడ్డారని ఎద్దేవా చేశారు. మోదీని హత్య చేసేందుకు పాకిస్థాన్ సుపారీ తీసుకుంటే... ఆ దేశంపై యుద్ధ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ విజయంపై మోదీని ఇంతవరకు ఆ పార్టీ కురువృద్ధుడు అద్వానీ అభినందించలేదని... మోదీ ఎంత దిగజారిపోయారో చెప్పడానికి ఇది చాలని అన్నారు. 

Narendra Modi
Revanth Reddy
revanth fires on modi
BJP
Congress
  • Loading...

More Telugu News