Hyderabad: లలితా జువెల్లరీ దొంగతనం కేసులో వీడిన మిస్టరీ
- పది రోజుల వ్యవధిలో రెండు చోరీలు
- ఒకదానిలో నిందితుల పట్టివేత
- మరో కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
హైదరాబాద్‌లోని లలిత జువెల్లరీలో జరిగిన రెండు చోరీ కేసుల్లో ఓ దానిలో మిస్టరీ వీడింది. ఈ నెల మూడున జరిగిన చోరీ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బురఖా ధరించిన ఇద్దరు మహిళలు షాపులోకి వచ్చి 20 తులాల బంగారు గొలుసులను దొంగిలించారు. వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలను ఉంచి పరారయ్యారు.
ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే యువతీ యువకులు ఇద్దరు నగలు కొనేందుకు షాపులోకి వచ్చారు. సేల్స్‌మెన్ కన్నుగప్పి 6.6 తులాల బంగారు గాజులను దొంగిలించారు. సీసీటీవీలో చోరీని గుర్తించిన యాజమాన్యం వారిపై ఈనెల 13న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. సోమవారం ఆ జంటను అదుపులోకి తీసుకుని దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.