delhi: ఈ విజయం నాకు రెట్టింపు సంతోషాన్నిచ్చింది.. సామాన్య విజయం కాదు: ఢిల్లీలో ప్రధాని మోదీ
- జీఎస్టీ వల్ల ఓడిపోతామని అన్నారు
- ప్రజలు జీఎస్టీకి మద్దతు తెలిపి మాకు అండగా నిలిచారు
- గుజరాత్, హిమాచల్ ప్రజలు అభివృద్ధికి పట్టం గట్టారు
- అభివృద్ధి చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారని హిమాచల్ ప్రజలు నిరూపించారు
జీఎస్టీ వల్ల ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని గతంలో కొందరు అన్నారని, అలాగే గుజరాత్‌లోనూ ఓడిపోతుందని తాజాగా అన్నారని, కానీ, తమ పార్టీ గెలిచి చూపించిందని, ప్రజలు జీఎస్టీకి మద్దతు తెలిపి తమకు అండగా నిలిచారని ప్రధాని ఉద్ఘాటించారు. గుజరాత్, హిమాచల్ ప్రజలు అభివృద్ధికి పట్టం గట్టారని తెలిపారు. బీజేపీకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారంటే ప్రజలు దేశంలో సంస్కరణలు, మార్పులు కోరుకుంటున్నారని అర్థం అని మోదీ అన్నారు.
గుజరాత్‌లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమైనదని, అక్కడ వరుసగా తమ పార్టీ గెలుస్తూ వస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారని చెప్పడానికి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని మోదీ అన్నారు.
గుజరాత్‌లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలు పన్నిందని, ప్రజలు వాటిని తిప్పికొట్టారని అన్నారు. గుజరాత్‌లో విజయం తనకు రెట్టింపు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తాను రాష్ట్రం విడిచి వెళ్లినా గుజరాత్ బీజేపీ నేతలు అభివృద్ధి కొనసాగించారని చెప్పారు. ఆ రాష్ట్రంలో సుపరిపాలన వల్లే ప్రజలు తమకు మళ్లీ అవకాశం ఇచ్చారని తెలిపారు.