తనికెళ్ళ భరణి: నేను పులకించి రాసిన ఈ మాటలు కేసీఆర్ కే అంకితం: తనికెళ్ల భరణి

  • ప్రపంచ తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతం
  • కేసీఆర్ తన గురువుకు పాదాభివందనం చేయడం చూసి పులకించిపోయా
  • ఆ సందర్భంలో నేను పులకించిన రాసిన మాటలు కేసీఆర్ కే అంకితం
  • ఓ ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి

ప్రపంచ తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతమని, చాలా క్రమశిక్షణగా నిర్వహిస్తున్నారని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ స్థాయిలో తెలుగు పండగ చేయడమనేది అనిర్వచనీయమైన అనుభూతి అని అన్నారు.

‘తెలుగు చచ్చిపోతోంది, తెలుగు మాట్లాడే వారికి అన్నం పుట్టదు’ అనే మాటలు కాకుండా ‘తెలుగు మాట్లాడితేనే గౌరవం..తెలుగువాడిగా పుట్టడంలో ఓ సొగసుంది..ఆనందం ఉంది’ అనే గొప్ప అనుభూతులు ఈ మహాసభల ద్వారా పొందుతున్నాను. ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి..తన గురువును ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు పాదాభివందనం చేయడాన్ని చూసిన వారి హృదయాలు చలించిపోయాయి. ‘ఈ దృశ్యాన్ని నేను టీవీలో చూసి ఆనందంతో పులకరించిపోయాను. ఆ సందర్భంలో నేను రాసిందేమిటంటే..

సరస్వతికి సంస్కారం మొక్కినట్లు ఉన్నది
బంగారు తెలంగాణ మెట్లు ఎక్కినట్లు ఉన్నది
మన లోపలి అహమంతా కాలినట్లు ఉన్నది
కల్వకుంటలో చంద్రుడు తేలినట్టు ఉన్నది


ఇది మనస్ఫూర్తిగా కేసీఆర్ కే అంకితం’ అని భరణి అన్నారు. తెలుగు అనేది మన మాతృభాష అని, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, పిల్లలకు పద్యాలు నేర్పాలని, తెలుగు గొప్పదనం చెప్పాలని సూచించారు. తెలుగు భాషా పోషణలో గురువుల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర అవసరమని, ప్రపంచ తెలుగు మహాసభల పండగలో పాల్గొన్నాం.. వెళ్లిపోయామని కాకుండా..చిన్న స్థాయిలో పాఠశాలలు, కళాశాలల్లో కనీసం నెలకు ఒక్కసారైనా తెలుగు వాళ్లందరూ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, అలా చేస్తే చాలా బాగుంటుందని భరణి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News