రాయ్‌బరేలీ: రాయ్‌బరేలీ నుంచి పోటీపై ప్రియాంక వాద్రా స్పందన!
- రాయ్‌బరేలీ నుంచి అమ్మ సోనియా గాంధీ పోటీ చేస్తారు
- ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు
- స్పష్టం చేసిన ప్రియాంక వాద్రా
ప్రతిసారి సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక వాద్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే ఊహాగానాలు వెలువడటం, వాటిని ఆమె ఖండిస్తుండటం తెలిసిందే. రాయ్ బరేలి నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేయనుందనే తాజా ఊహాగానాలపై ఆమె స్పందించారు. ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి తన తల్లి సోనియాగాంధీ పోటీ చేస్తారని, తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, రాజకీయాల నుంచి తాను విశ్రాంతి తీసుకుంటానని సోనియాగాంధీ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక వాద్రా పోటీ చేస్తారనే ఊహాగానాలు తలెత్తాయి. ఈ విషయమై ప్రియాంక వాద్రా స్పష్టమైన వివరణ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్టయింది. ఇదిలా ఉండగా, రాజకీయాల నుంచి సోనియాగాంధీ తప్పుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ లో పేర్కొనడం గమనార్హం.