subhalekha sudhakar: తండ్రి మాట కాదనలేకనే నటించడానికి శైలజ అంగీకరించింది: 'శుభలేఖ' సుధాకర్
- అలా శైలజ 'భరతనాట్యం' నేర్చుకుంది
- ఆమె అరంగేట్రానికి విశ్వనాథ్ గారు వచ్చారు
- 'సాగరసంగమం'లో చేయమని అడిగారు
తాజాగా ఐ డ్రీమ్స్ తో 'శుభలేఖ' సుధాకర్ మాట్లాడుతూ, నటన పట్ల ఎంత మాత్రం ఆసక్తిలేని శైలజ, 'సాగర సంగమం' సినిమాలో చేయడానికి దారితీసిన పరిస్థితులను గురించి వివరించారు. "బాలూ గారి అమ్మాయి పల్లవికి 'భరత నాట్యం' నేర్పడానికి రోజూ మాస్టర్ వచ్చేవారు. దాంతో ఖాళీగా వున్న సమయాల్లో శైలజ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. బాగా చేస్తోందని చెప్పేసి అరంగేట్రానికి ప్లాన్ చేయడం .. ఆ ఫంక్షన్ కి విశ్వనాథ్ గారు రావడం జరిగాయి.
అప్పటికే విశ్వనాథ్ గారు 'సాగర సంగమం' కథను అనుకోవడం జరిగింది. శైలజ నాట్యం చూసిన ఆయన .. జయప్రద కూతురు పాత్రకి ఆమె అయితే బాగుంటుందని భావించారు. ఆ విషయాన్ని విశ్వనాథ్ గారు శైలజను అడిగితే తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం .. బాలూ గారు చెప్పినా తనకి ఇష్టం లేదని అనడం జరిగాయి. దాంతో విశ్వనాథ్ గారు నేరుగా శైలజ నాన్నగారి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. వాళ్ల నాన్నగారు అడగడంతో .. ఆయన మాట కాదనలేక ఆ సినిమా చేసింది .. నిజానికి ఆమెకు నటన పట్ల అస్సలు ఆసక్తి లేదు" అని చెప్పుకొచ్చారు.