చంద్రన్న సరుకులు: ఏపీ ప్రజలకు ‘చంద్రన్న కానుకలు’
- సంక్రాంతి కానుక... జనవరి 1 నుంచి ‘చంద్రన్న సరుకులు’
- 20 నుంచి 26వ తేదీ వరకు ‘చంద్రన్న క్రిస్మస్’ కానుక
- మీడియాతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక అందనుంది. జనవరి 1 నుంచి చంద్రన్న కానుక పేరిట సరుకులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఒక కోటి నలభై లక్షల లబ్దిదారులకు చంద్రన్న కానుకలు పంపిణీ జరగనున్నాయని చెప్పారు. చంద్రన్న కానుక కింద రూ.226 విలువ చేసే ఆరు రకాల వస్తువులను అందజేయనున్నట్టు చెప్పారు.
కాగా, ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ‘చంద్రన్న క్రిస్మస్’ కానుక ఇవ్వనున్నామని, ఈ కానుకల కింద కందిపప్పు, బెల్లం, పచ్చి శెనగలు అరకిలో చొప్పున, కిలో గోధుమపిండి, అరలీటర్ పామాయిల్, వంద గ్రాముల నెయ్యి, ఒక క్యారీ బ్యాగ్ అందించనున్నట్టు చెప్పారు. చంద్రన్న సంక్రాంతి కానుక , క్రిస్మస్ కానుకల్లో నాణ్యత కనుక లోపిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
ఇదిలా ఉండగా, వేలిముద్రల వినియోగదారులకు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు రేషన్ బియ్యం అందజేస్తామని చెప్పిన పుల్లారావు, రేషన్ ద్వారా ఇచ్చే కందిపప్పుని రెండు కిలోలకు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.