Ravindra Jadeja: జడేజా కూడా అద్భుతం చేశాడు.. రవిశాస్త్రి, యువీ సరసన చేరాడు!

  • అంతర్ జిల్లా టీ20 టోర్నీలో చెలరేగిన జడేజా
  • ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు
  • రవిశాస్త్రి, యువీ సరసన చోటు

టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే జట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన జడేజా ప్రస్తుతం సౌరాష్ట్ర తరపున ఆడుతున్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్‌సీఏ) శుక్రవారం నిర్వహించిన అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడేజా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రవిశాస్త్రి, యువరాజ్ సింగ్‌ల సరసన చేరాడు.

జామ్ నగర్ జట్టు తరపున ఆడుతున్న జడేజా.. అమ్రేలీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 69 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 154 పరుగులు చేశాడు. 15వ ఓవర్‌లో ఆఫ్ స్పిన్నర్ నీలం వంజాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. వేసిన ఆరు బంతులను సిక్సర్లు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

జడేజా దెబ్బకు అమ్రేలీ జట్టు పరాజయం పాలైంది. కాగా, గతంలో రవిశాస్త్రి, యువరాజ్ సింగ్‌లు ఈ ఘనత సాధించారు. 1985లో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరపున బరిలోకి దిగిన రవిశాస్త్రి బరోడా బౌలర్ తిలక్‌రాజ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు.

Ravindra Jadeja
Cricket
Sixes
  • Loading...

More Telugu News