telangana: గత పాలకులు మనకు సమస్యలు మాత్రమే ఇచ్చి వెళ్లారు: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి
- మాది ఉగ్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్
- ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం
- వైద్య ఆరోగ్య శాఖలో అనేక సమస్యలు పరిష్కరించాం
- ప్రజా సేవా దృక్పథంతో ఉద్యోగులు పని చేయాలి
తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్ కోఠిలోని వైద్య కార్యాలయాల సముదాయంలో టీఆర్ఎస్ కేవీ అనుబంధ సంఘం, తెలంగాణ వైద్య ప్రజారోగ్య శాఖ ఉద్యోగుల సంఘం 3వ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణలో భాగంగా ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
వైద్య, ఆరోగ్య రంగం గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో వైద్య, ఆరోగ్య రంగం గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందుతుందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. విద్య, వైద్య ఆరోగ్య రంగాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. గత పాలకులు మనకు సమస్యలు మాత్రమే ఇచ్చి వెళ్లారని అన్నారు. తెలంగాణ వచ్చాక, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో అనేక సమస్యలు పరిష్కరించామని చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ పోస్టుల భర్తీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆశా వర్కర్లకు రూ. 6 వేలు వారి వారి ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశా వర్కర్లకి రూ.6 వేలు ప్రోత్సాహకం ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదని అన్నారు. ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు. వైద్య, ఆరోగ్యం అతి సున్నితమైన రంగం అని ఈ రంగంలో ఉండే వాళ్లు అందుకు తగ్గట్లుగా పని చేయాలని అన్నారు. విధుల్లో అలక్ష్యం తగదని, ప్రజా సేవా దృక్పథంతోనే పని చేయాలని లక్ష్మారెడ్డి సూచించారు.