‘పోలవరం’: ‘పోలవరం’ పూర్తవుతుందనే భరోసా వచ్చింది: సీఎం చంద్రబాబు
- కేంద్ర ప్రభుత్వాన్ని, గడ్కరీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా
- ‘పోలవరం’ను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పూర్తి చేసి తీరుతాం
- గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కనుక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం, భరోసా వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు నిన్న భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఈరోజు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబుకు రైతులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నితిన్ గడ్కరీతో నిన్న జరిగిన సమావేశం రాబోయే రోజుల్లో రాష్ట్రానికి శుభం చేకూర్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, గడ్కరీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత గుత్తేదారు ఆయా పనులను పూర్తి చేసేందుకు ఒక నెల గడువు ఇస్తామని గడ్కరీ చెప్పారని, ఆ గడువు లోపు నిర్ణీత పనులు పూర్తి చేయకపోతే గుత్తేదారు మార్పుపై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పిన విషయాన్ని బాబు ప్రస్తావించారు.
గడ్కరీ హామీతో, తనతో పాటు రైతుల్లో నమ్మకం, భరోసా వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, పూర్తి చేసి తీరుతామని మరోమారు స్పష్టం చేశారు. పూర్తిగా కరువు పోయే పరిస్థితి రావాలని, ప్రతి రైతుకీ నీటి భద్రత, భరోసా ఉండాలని అన్నారు. నీటి భద్రత కనుక కల్పిస్తే బంగారం పండించే రైతాంగం మనకు ఉందని అన్నారు.