google: ఆండ్రాయిడ్ లాలీపాప్ వెర్షన్‌కి కూడా గూగుల్ వాయిస్ అసిస్టెంట్
- అందుబాటులోకి తీసుకువచ్చిన గూగుల్
- ఇప్పటివరకు నౌగట్, ఆ పై వెర్షన్లకే పరిమితమైన వాయిస్ అసిస్టెంట్
- లాలీపాప్ వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో నిర్ణయం
వాయిస్ ఆదేశాల ద్వారా సెర్చ్ చేసే సదుపాయాన్ని కల్పించే గూగుల్ అసిస్టెంట్ సేవలను ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0, 5.1 వెర్షన్లకు కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఈ సేవలు ఆండ్రాయిడ్ నౌగట్, ఆ పై వెర్షన్లైన ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టంలకు మాత్రమే అందుబాటులో ఉండేవి.
అయితే ఇటీవల వెల్లడైన వివరాల ప్రకారం మొత్తం ఆండ్రాయిడ్ వినియోగదారుల్లో లాలీపాప్ వెర్షన్ వాడుతున్నవారు 26.3 శాతం ఉండటంతో వారికి కూడా వాయిస్ అసిస్టెంట్ సదుపాయాన్ని కల్పించాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే లెక్కల ప్రకారం ఆండ్రాయిడ్ నౌగట్ వాడుతున్న వారు 23.3 శాతం, ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో వాడుతున్నవారు 29.7 శాతం ఉన్నట్లు సమాచారం.
గూగుల్ అసిస్టెంట్ సహాయంతో కావాల్సిన అంశాన్ని వాయిస్ ఆదేశాల ద్వారా సెర్చ్ చేయవచ్చు. గూగుల్‌తో అనుసంధామై ఉన్న జీమెయిల్, గూగుల్ ప్లస్, గూగుల్ డ్రైవ్, ప్లే స్టోర్, మ్యూజిక్ ప్లేయర్ ఇలా అన్ని రకాల యాప్‌లను దీని సహాయంతో మేనేజ్ చేయవచ్చు. భారత్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాల్లోని ఆండ్రాయిడ్ లాలీపాప్ వినియోగదారులకు ఈ సదుపాయాన్ని గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.