కల్యాణదుర్గం: తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు!
- జల్సాలకు బానిసై డబ్బు కోసం దొంగతనాలు చేస్తున్న ముఠా
- కల్యాణదుర్గం రోడ్డులోని పెద్దమ్మగుడి వద్ద నిందితుల అరెస్టు
- రూ.5.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం
జల్సాలకు బానిసై డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ లోని తారకరామారావునగర్ కు చెందిన ఆవుల గిడ్డయ్య, శ్రీనివాసరావునగర్ కు చెందిన ఎరుకుల ముంగాశంకర్ దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా, తాళం వేసిన ఇళ్లలో వీరు దొంగతనాలకు పాల్పడే వారు. పలు కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు నిఘా ఉంచారు. కల్యాణదుర్గం రోడ్డులోని పెద్దమ్మగుడి వద్ద నిందితులు ఉన్నట్లు పోలీసులకు ఈరోజు ఉదయం సమాచారం అందింది. దీంతో, వెంటనే అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.5.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు నెక్లెస్ లు, గాజులు, ఉంగరాలు, చైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.