Sudhakar: స్వాతి ప్రియుడు రాజేష్ ను అరెస్ట్ చేద్దామంటే, పోలీసుల ముందు కొత్త సంకటం!
- పెండింగ్ బిల్లు కడితేనే డిశ్చార్జ్
- స్పష్టం చేసిన ఆసుపత్రి వైద్యులు
- తలపట్టుకున్న పోలీసులు
రాజేష్... గత వారం రోజులుగా తెలుగు మీడియాలో నానుతున్న పేరు. ప్రియురాలు స్వాతిపై ఉన్న మోజుతో, ఆమెతో కలసి ప్లాన్ చేసి, భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేసి, ఆపై తనకు తానుగా యాసిడ్ దాడి జరిగినట్టు డ్రామా ఆడి, హాస్పిటల్ లో సుధాకర్ గా చేరిన వ్యక్తి. విషయం మొత్తం బయటపడగా, ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు వారి ముందు కొత్త సంకటం ఎదురైంది.
ఇంతకీ విషయం ఏంటంటే, సుధాకర్ లా నటిస్తున్న రాజేష్ ను ఆసుపత్రికి తెచ్చినప్పటి నుంచి నాలుగు రోజుల పాటు చికిత్సకు అయిన ఖర్చులను సుధాకర్ కుటుంబమే భరించింది. దాదాపు రూ. 1.60 లక్షల బిల్లు కూడా కట్టింది. ఆపై స్వాతి చేసిన దుర్మార్గపు ఎత్తుగడ గురించి అందరికీ తెలిసి, ఆమె జైలుకు వెళ్లగా, రాజేష్ ను అరెస్ట్ చేయాలంటే, ముందు వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్ చేయాలంటే, పెండింగ్ బిల్లు సుమారు రూ. 2 లక్షలను తమకు చెల్లించాల్సిందేనని వైద్యులు పోలీసుల ముందు తమ డిమాండ్ ను ఉంచారు.
రాజేష్ చికిత్సకు మొత్తం మూడున్నర లక్షలకు పైగానే అయిందని, అతనిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళితే, తమకు రావాల్సిన బకాయిలు రావన్నది వారి వాదన. బెడ్ మీదున్నది తమ బిడ్డ కాదని తెలుసుకున్న క్షణం నుంచి ఒక్క పైసా కూడా సుధాకర్ తల్లిదండ్రులు కట్టలేదు. ఇప్పుడు ఆ డబ్బును ఎలా ఎడ్జస్ట్ చేయాలా? అని నాగర్ కర్నూలు పోలీసులు తలపట్టుకున్నట్టు తెలుస్తోంది.