Sudhakar: 'హాయ్ సుధాకర్' అనగానే ఆనందంగా స్పందించిన రాజేష్... ఆపై హతాశుడయ్యాడు!
- ఈ ఉదయం రాజేష్ ను విచారించిన పోలీసులు
- 'ఆధార్' పోల్చి, సుధాకర్ కాదని తొలి నిర్ధారణ
- అరెస్ట్ ను చూపి కోర్టుకు తరలిస్తామన్న పోలీసులు
యాసిడ్ దాడి నాటకం ఆడి, సుధాకర్ స్థానంలో ఆసుపత్రి బెడ్ పై ఉన్న రాజేష్ ను పోలీసులు నేడు విచారించారు. గత నాలుగు రోజులుగా రాజేష్ కోలుకోవడం కోసం ఎదురుచూసిన నాగర్ కర్నూల్ పోలీసులు, ఈ ఉదయం, వైద్యుల అనుమతితో రాజేష్ తో మాట్లాడారు. తాము పోలీసులమని పరిచయం చేసుకుని, 'హాయ్ సుధాకర్... ఎలా ఉన్నావు?' అని అడగగానే, ఆయన పేరును వాడుకుంటున్న రాజేష్, ఆనందంగా స్పందించాడని తెలుస్తోంది.
ఆపై కేసు విచారణ నిమిత్తం ఆధార్ ఐడెంటిఫికేషన్ చేయాలని, కాసేపట్లో ఆధార్ యంత్రంతో వస్తామని పోలీసులు చెప్పగా, హతాశుడైన రాజేష్, ఏం చేయాలో, ఎలా చెప్పాలో పాలు పోని స్థితికి వెళ్లిపోయాడని, ఆపై కాసేపటికే వచ్చిన పోలీసులు, స్వాతి బండారం బట్టబయలైన విషయం చెప్పి, రాజేష్ వేలిముద్రలు తీసుకుని, అతను సుధాకర్ కాదన్న తొలి సాక్ష్యాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు. నిన్న రాజేష్ ను అరెస్ట్ చేయాలని చూసినా, అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కుదరలేదని, కేసు విచారణ ఇక మరింత వేగవంతం అవుతుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.