swathi: సుధాకర్ - స్వాతి - రాజేష్... మధ్యలో మటన్ సూప్... అనుమానానికి తొలి కారణం!
- స్వాతి భర్త స్థానంలో ఆసుపత్రిలో రాజేష్
- రాజేష్ శాకాహారి కావడంతో మటన్ సూప్ నిరాకరణ
- తొలి అనుమానం అక్కడే వచ్చిందన్న పోలీసులు
- తీగ లాగితే కదిలిన స్వాతి డొంక
యాసిడ్ దాడి జరిగిన తమ కుమారుడు బెడ్ పై చికిత్స పొందుతున్నాడని భావించి, కోడలికి మనోధైర్యాన్ని ఇస్తూ, ఆసుపత్రిలో రాజేష్ ను చూసి, తమ కుమారుడేనని భావిస్తున్న వారికి తొలి అనుమానం ఎప్పుడు కలిగింది? బెడ్ పై ఉన్నది సుధాకర్ కాదన్న అనుమానం ఆయన తల్లిదండ్రులకు ఎక్కడ వచ్చిందన్న విషయాన్ని పోలీసులు వెల్లడించారు. సాధారణంగా ఆసుపత్రి బెడ్ పై ఉంటే, వారికి బలవర్ధక ఆహారంగా మటన్ సూప్ ను ఇస్తారు.
అలాగే రాజేష్ కు కూడా ఆసుపత్రి వర్గాలు మటన్ సూప్ ను ఇవ్వబోగా, ఆయన దాన్ని నిరాకరించాడు. స్వతహాగా మాంసాహారి అయిన సుధాకర్, మటన్ సూప్ ను ఇష్టంగానే తాగుతుంటాడట. ఈ విషయం ఆయన తల్లిదండ్రులకు కూడా తెలుసు. బెడ్ పై ఉన్న కుమారుడు మటన్ సూప్ వద్దనడం, బలవంతం చేయబోయినా ముట్టకపోవడంతో వారికి తొలి అనుమానం వచ్చింది. రాజేష్ శాకాహారి కావడంతోనే మటన్ సూప్ ను వద్దని చెప్పాడని, దానివల్లే వారికి అనుమానం వచ్చి, అది తమదాకా వచ్చిందని పోలీసులు వెల్లడించారు. వారి ఫిర్యాదుతోనే స్వాతి బండారాన్ని బట్టబయలు చేయగలిగామని తెలిపారు.