KCR: చప్రాసీ ఉద్యోగానికి కూడా పనికిరాని కేటీఆర్: రేవంత్ నిప్పులు
- ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఆగని బలిదానాలు
- భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలం
- కేసీఆర్ రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే: రేవంత్
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పరిశీలిస్తే, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తెలంగాణలో చప్రాసీ ఉద్యోగానికి కూడా అర్హత సాధించలేని స్థాయిలో ఉంటాడని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా యువత బలిదానాలు ఆగడం లేదని, యువత భవిష్యత్ పై భరోసాను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కేసీఆర్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని హెచ్చరించారు. దళితుల రిజర్వేషన్ ను కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందని ఎద్దేవా చేసిన ఆయన, స్వయంగా కేసీఆర్ వియ్యంకుడు నకిలీ సర్టిఫికెట్ తో పబ్బం గడుపుకుంటున్నారని, ఈ విషయంలో ఫిర్యాదు చేస్తే దాన్ని తొక్కిపెట్టారని ఆరోపించారు. వియ్యంకుడిపై చర్యలు తీసుకొనే దమ్ము కేసీఆర్ కు ఉందా? అని రేవంత్ ప్రశ్నించారు.