pawan kalyan: మంత్రి అఖిలప్రియ భేషజాలకు పోరాదు..వీరిని పరామర్శించాలి!: పవన్ కల్యాణ్
- బాసర విద్యాలయంలో ఏపీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది
- ఏపీ నేతలు టీఆర్ఎస్ నేతలతో కలసి వ్యాపారాలు చేసుకుంటున్నారు
- వీరిలో జవాబుదారీతనం కొరవడింది
బాసర విద్యాలయంలో ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ జరగడం లేదని... కానీ ఇదే సమయంలో ఏపీ మంత్రులు, నేతలు టీఆర్ఎస్ నేతల పెళ్లిళ్లకు వెళతారని, వారితో కలిసి వ్యాపారాలు చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇవి నేను చెబుతున్న మాటలు కావని... మొన్నటి దాకా టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలని అన్నారు. నేతలందరికీ పెళ్లిళ్లకు, వ్యాపారాలకు ఇంత సమయం ఉందని... కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి అడగడానికి మాత్రం వీరికి సమయం లేదని నిప్పులు చెరిగారు.
అక్కడ ఏపీ విద్యార్థులంతా రోడ్లపై ఉంటే, వీరు మాత్రం వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. జవాబుదారీతనం లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. ఇదే సమయంలో ఏపీ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియకు పవన్ కొన్ని సూచనలు చేశారు. అఖిలప్రియ భేషజాలకు పోరాదని... ఒంగోలుకు వచ్చి కృష్ణానది పడవ ప్రమాదంలో దుర్మరణంపాలైన వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించాలని అన్నారు.