గుజరాత్ ఎన్నికలు: గుజరాత్ ఎన్నికలు.. ఈవీఎంలకు బ్లూటూత్ కనెక్షన్ పెట్టారని కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపణ!
- పోర్ బందర్, సూరత్, జెట్ పూర్ ప్రాంతాల్లో ఈవీఎంలకు బ్లూటూత్
- రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఫిర్యాదు
- స్పందించిన ఎన్నికల సంఘం
గుజరాత్ లోని శాసనసభ ఎన్నికల పోలింగ్ లో ఈవీఎంలకు బ్లూటూత్ కనెక్షన్ పెట్టారని పోర్ బందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్జున్ మోధ్ వాడియా ఆరోపించారు. పోర్ బందర్, సూరత్, జెట్ పూర్ ప్రాంతాల్లోని ఈవీఎంలకు బ్లూటూత్ కనెక్షన్ పెట్టి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన ఎన్నికల సంఘం ఆయా పోలింగ్ కేంద్రాల్లోని దాదాపు డెబ్భై ఈవీఎంలను మార్చేసింది.
కాగా, సూరత్ లో 70కి పైగా ఈవీఎంలు మొరాయించగా వాటి స్థానే కొత్త ఈవీఎంలను అమర్చినట్టు ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి పేర్కొన్నారు. జెట్ పూర్ నియోజకవర్గంలోని జామ్ కండోర్న బూత్ లో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో, ఎన్నికల పోలింగ్ పావుగంట పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. రాజ్ కోట జిల్లాలో 33 ఈవీఎం యంత్రాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు కొంత ఇబ్బందిపడ్డారు. సమస్యల కారణంగా పోలింగ్ ఆలస్యం అయిన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.