ప్రధాని మోదీ: మోదీని నరహంతకుడితో పోల్చిన మహేశ్ కత్తిపై కేసు నమోదు చేయండి: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్
- ఓ ట్వీట్ లో స్పందించిన రాజా సింగ్
- మహేశ్ కత్తిపై కేసు నమోదు చేయాలి
- హైదరాబాద్ సిటీ పోలీస్ కు విన్నవించుకున్న బీజేపీ నేత
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని విమర్శించే క్రమంలో ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా మహేశ్ కత్తి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై హైదరాబాదు, పాతబస్తీ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు.
వార్తల్లో నిలవాలనే ఉద్దేశ్యంతో, చౌకబారు పబ్లిసిటీ కోసం ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేయడం తగదని రాజా సింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించారు. మోదీని నరహంతకుడితో పోల్చిన మహేశ్ కత్తిపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కు విన్నవించుకుంటున్నానని ఆ ట్వీట్ లో కోరారు. ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందిస్తూ, ‘తగు చర్యల నిమిత్తం సంబంధింత అధికారికి మేము షేర్ చేస్తాం. థ్యాంక్యూ’ అని తెలిపారు.
కాగా, ‘మోదీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రాన మోదీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్’ తన ట్వీట్ లో మహేశ్ కత్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.