‘హెరిటేజ్’: మా కుటుంబానికి ‘హెరిటేజ్’ నుంచే ఆదాయం వస్తోంది: నారా లోకేశ్
- ‘హెరిటేజ్’ సంస్థ రూ.2,600 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది
- ప్రజామోదం ఉంటేనే రాజకీయ వారసులుగా నిలబడతారు
- మీడియాతో నారా లోకేశ్
హెరిటేజ్ సంస్థ రూ.2,600 కోట్ల టర్నోవర్ కు చేరుకుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తమ కుటుంబ ఆస్తుల వివరాలను ఈరోజు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని, తమ కుటుంబానికి ‘హెరిటేజ్’ నుంచే ఆదాయం వస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతూ, వారసులుగా అవకాశం వచ్చిన మాట వాస్తవమే, కానీ, ప్రజామోదం ఉంటేనే నిలబడగలమని అన్నారు.
వైసీపీ అధినేత జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని, ఆ ప్రాజెక్టు పూర్తి కాకూడదని వైసీపీ నేతలు దేవుడ్ని ప్రార్థిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు సహా అన్ని అంశాలపై చర్చించామని, వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చి చర్చించి ఉంటే ఆ ప్రాజెక్టు గురించిన అన్ని విషయాలు వారికి తెలిసేవని అన్నారు. అసెంబ్లీకి రాకుండా ‘అఖిలపక్షం’ అంటూ వైసీపీ డిమాండ్ చేయడం సబబు కాదని లోకేశ్ విమర్శించారు.