Congress: కొంపముంచిన ‘నీచ్’.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మణిశంకర్ అయ్యర్‌ సస్పెన్షన్!

  • మోదీ నీచ జాతివాడంటూ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన మోదీ
  • స్పందించిన కాంగ్రెస్.. మణిశంకర్ సస్పెన్షన్

ఫ్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయి. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆకాంక్షను వాస్తవం చేయడానికి కృషి చేసిన వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ అని, ఆయన కుటుంబంపై ఓ వ్యక్తి (మోదీ) చెడుగా మాట్లాడుతున్నారని, అది కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మరీ చెడుగా  మాట్లాడుతున్నారని విమర్శిస్తూ, ఆ వ్యక్తి చాలా నీచుడు, సభ్యత లేనివాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సమయంలో నీచ రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు.

మణిశంకర్ అయ్యర్ తనపై నోరు జారిన నిమిషాల్లోనే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోదీ ఆయన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మొఘలాయి మనస్తత్వం కలవారు తనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తాను నీచ జాతివాడినని మణిశంకర్ అయ్యర్ అవహేళన చేస్తున్నారని, ఇది మొత్తం గుజరాతీయులను, భారతీయులను అవమానించడమేనంటూ ఘాటుగా స్పందించారు.

ప్రధాని మోదీపై మణిశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తక్షణం స్పందించారు. కాంగ్రెస్‌ను నిత్యం విమర్శించేందుకు బీజేపీ, ప్రధాని పరమ రోత భాషను ఉపయోగిస్తుంటారని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన సంస్కృతి, వారసత్వం ఉన్నాయని పేర్కొన్న రాహుల్.. మణిశంకర్ అయ్యర్‌ను తాను సమర్థించడం లేదని, ఆయన ఉపయోగించిన భాష, బాణీని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించేది లేదని పేర్కొన్నారు. ఆయన క్షమాపణలు చెబుతారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.  

తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మణిశంకర్ వెనక్కి తగ్గారు. సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన వ్యాఖ్యలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. తన మాతృభాష హిందీ కాకపోవడంతో ఇంగ్లిష్‌ పదాలను హిందీలోకి తర్జుమా చేసే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. నీచ్ అనే మాట ద్వారా తాను చెప్పాలనుకున్నది వేరని, అర్థం అయింది వేరొకటి కాబట్టి క్షమాపణలు చెబుతున్నట్టు చెప్పారు.

అయితే, గుజరాత్ రెండో విడత ఎన్నికల వేళ ఆయన వ్యాఖ్యలు పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నుంచి మణిశంకర్ అయ్యర్‌ను సస్పెండ్ చేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.

  • Loading...

More Telugu News