sensex: రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల బాట పట్టిన మార్కెట్లు!
- 33వేల పాయింట్ల దరిదాపులకు చేరువైన సెన్సెక్స్
- నిఫ్టీకి 123 పాయింట్ల లాభం
- ఉదయం నుంచే పుంజుకున్న మార్కెట్లు
గత రెండు రోజుల్లో నష్టాల్లో మునిగి తేలిన దేశీయ మార్కెట్ల పరిస్థితి ఇవాళ చాలా మెరుగు పడింది. ఉదయం నుంచే లాభాల బాటను పట్టడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 33 వేల పాయింట్ల దరిదాపులకు చేరుకోగా, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్‌లో 80 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభమై, మార్కెట్ ముగిసే సమయానికి 352 పాయింట్లు ఎగబాకి 32,949 వద్ద స్థిరపడింది.
ఇక నిఫ్టీ కూడా 123 పాయింట్ల లాభంతో 10,167 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.59గా కొనసాగుతోంది. లాభపడిన షేర్లలో గెయిల్, ఎయిర్‌టెల్, టెక్‌మహీంద్రా, యూపీఎల్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ ఉండగా... కోల్ ఇండియా, టీసీఎస్, విప్రో, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు అత్యల్పంగా నష్టపోయాయి.