beer: బీరులో ఉండే ఆల్కహాల్‌తో కారు నడపొచ్చు.... ప్రయోగస్థాయిలో సాధ్యం చేసిన పరిశోధకులు
- ఇథనాల్‌ని బ్యుటనాల్‌గా మార్చే ప్రక్రియ ద్వారా సాధ్యం
- ప్రత్యామ్నాయ ఇంధన వనరుల పరిశోధనలో మరో ముందడుగు
- పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్తామంటున్న బ్రిస్టల్ యూనివర్సిటీ అధ్యాపకులు
బీర్లలోని ఆల్కహాల్‌లో ఉండే ఇథనాల్ నుంచి ఉత్ప్రేరక ప్రక్రియ ద్వారా బ్యుటనాల్‌ను వెలికి తీసి దాని ద్వారా కార్లను నడపవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరిగి పోతున్న ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా వేరే వనరుల వెతుకులాటలో భాగంగా వారు ఈ విషయాన్ని కనిపెట్టారు.
ప్రస్తుతం ప్రయోగశాల స్థాయిలో మాత్రమే విజయవంతమైన ఈ విధానాన్ని త్వరలో పెద్ద మొత్తంలో ఇంధనం ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తామని బ్రిస్టల్ యూనివర్సిటీ అధ్యాపకుడు డంకన్ వాస్ తెలిపారు. ఇప్పటికే పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో దీనిని పెద్ద ఎత్తున వాడుతున్నారు. తాజాగా తాము అభివృద్ధి చేసిన క్యాటలిస్ట్స్ బీర్లలోని ఇథనాల్‌ను విజయవంతంగా బ్యుటనాల్‌గా మార్చిందని డంకన్ వాస్ తెలిపారు.