Pawan Kalyan: వాళ్లను కొట్టినా, తిట్టినా సరిపోదు... ఏం చేయగలనో చేసి చూపుతా: పవన్ కల్యాణ్
- ప్రజలకు మంచి చేయాలన్న చిరంజీవి ఆలోచనను భూస్థాపితం చేశారు
- చిన్న చిన్న కీటకాలు కలిసి మెగాస్టార్ ను తినేశాయి
- వాళ్లంతా ప్రజా ద్రోహులే: పవన్ కల్యాణ్
రాజకీయాల్లో మార్పు తెస్తూ, ప్రజలకు మంచి చేయాలని అనుకున్న తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఎంతో మంది ద్రోహం చేశారని, వాళ్లను కొట్టినా, తిట్టినా సరిపోదని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లను ఏం చేయాలో అది చేసి, చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెబుతానని తెలిపాడు. పీఆర్పీని ఎవరెవరు దెబ్బతీశారన్న విషయాన్ని తాను ఏ క్షణం కూడా మరచిపోలేదని, వారి పేర్లన్నీ తన గుండెల్లో ఉన్నాయని అన్నారు.
ఓ మంచి పని చేయాలనుకున్న మెగాస్టార్ ను చిన్న చిన్న కీటకాలు తినేశాయని ఆరోపించారు. వారు తన అన్నకు చేసిన ద్రోహం కంటే, ప్రజలకు చేసిన ద్రోహమే తీవ్రమైనదని చెప్పారు. చిన్నపాటి స్వలాభాల కోసం, స్వల్పకాల ప్రయోజనాల కోసం ఓ గొప్ప ప్రయత్నానికి వారు అడ్డు తగిలారని అన్నారు. సీట్లు దక్కలేదని, అధికారం చేజిక్కలేదని తనకు బాధ లేదని, నవ రాజకీయాన్ని సృష్టించలేకపోయామన్నదే తన బాధని చెప్పుకొచ్చారు.